గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడగించాలి

నామినేషన్లు వేసే వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలి

తెలంగాణ సీఈఓను కోరిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ బీఆర్ కేఆర్ భవన్ లో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డితో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు గడువు పొడగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుందని.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగే వరకు ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

సీఈవోతో సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగుతుందని, గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు ఈనెల 6వ తేదీతో గడువు ముగిసి పోతుందని పేర్కొనడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పొడగించాలని తమ సూచనకు సీఈవో అంగీకరించారని తెలిపారు. తమ లాంటి కొత్త పార్టీలకు తమ ఎజెండాను చెప్పుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. రాష్ట్రంలోని మూడింట రెండో వంతు ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్నదని చెప్పారు. జెన్ జీలు, గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతుండటం.. పోటీ చేసే అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతుందని.. ఈ ప్రక్రియ మార్పు తీసుకురావాలని ఎన్నికల కమిషన్ ను కోరుతామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద విద్యాసంస్థల యజమానులు పోటీకి దిగుతుండటం.. వారి విద్యాసంస్థల్లోనే పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేస్తుండటంతో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని.. వీటిపైనా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సహకరించండి

తమ పార్టీ ‘‘తెలంగాణ రక్షణ సేన’’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉందని, ఈ విషయంలో తమకు సహకరించాలని సీఈవోను కోరామని కవిత చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా తమ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరును నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని సీఈవోను కోరామన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ అన్ని విభాగాల కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.