మా డిమాండుతోనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్):

తెలంగాణ రక్షణసేన డిమాండుకు తలొగ్గే ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చిందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిపి ఒకే కమిషన్‌గా ఏర్పాటు చేయడంతో అటు ఎస్సీలకు, ఇటు ఎస్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు తాము ప్రశ్నించామని గుర్తు చేశారు. సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సామాజిక, భౌగోళిక సమస్యలు పూర్తిగా వేర్వేరుగా ఉన్నాయన్నారు. నేటికీ ఎస్సీలు సమాజంలో పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటుంటే, మరోవైపు ఆదివాసీలను రకరకాల పేర్లతో అడవి నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.

గిరిజనులు తమ అస్తిత్వమైన ‘జల్-జంగల్-జమీన్’పై హక్కులను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆదివాసీలు, గిరిజన సమాజం అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వారికి మంచి చేస్తుందన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఎస్టీ కమిషన్ గిరిజనుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవాలని, వారి ఆత్మగౌరవాన్ని, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా పనిచేయాలని ఆకాంక్షించారు.