రేవంత్ పాలనలో వెంటిలేటర్ పై విద్యావ్యవస్థ

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం జరిగే ప్రమాదం

9 నుంచి 12  తరగతుల వరకు విద్యా సంస్థలకు అనుమతిస్తే ఆంధ్రా విద్యార్థులు అమలాపురంలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ పరీక్ష రాస్తారు

చంద్రబాబు శిష్యుడిగా ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు

పరిపక్వత లేని చిన్న పిల్లాడిలా ఈ ముఖ్యమంత్రి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నాడు

ఇంటర్ బోర్డు రద్దు చేయాలన్న తప్పుడు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలి

ఒంటెత్తు పోకడలతో ఇంటర్మీడియేట్ బోర్డు రద్దు చేస్తామంటే ఒప్పుకోం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో “ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

రేవంత్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ  వెంటిలేటర్ పైకి వెళ్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఐసీయూలో ఉన్న విద్యా వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం చేసే కుటిల యత్నం ఉందని ఉందన్నారు. తన గురువు చంద్రబాబు మెప్పుకోసం ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును రద్దు చేసి 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఆంధ్రా విద్యాసంస్థలకు అనుమతిచ్చే పని చేస్తున్నారన్నారు. దీని కారణంగా ఆంధ్రా విద్యాసంస్థల్లో అమలాపురంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్ లో పరీక్ష రాసి లోకల్ గా చెలామణి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం” అనే అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమాజి గూడలోని ఓ హోటల్ లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కవిత ప్రారంభ, ముగింపు ప్రసంగం చేస్తూ ఇంటర్ బోర్డు రద్దు అనే తప్పుడు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ నిర్ణయం కారణంగా ఏ రకంగానూ తెలంగాణ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం లేదన్నారు. ఏదైనా సంస్కరణగానీ, మార్పు గానీ చేయాల్సినప్పుడు దానికి ప్రూవ్డ్ ఎవిడెన్స్ అనేది ఉండాలన్నారు. ఇంటర్ బోర్డును విద్యాశాఖలో విలీనం చేయటమనేది విఫల ప్రయోగమని ఏపీ చేసిన ప్రయోగం ద్వారా మనకు స్పష్టమైందని గుర్తుచేశారు. అయిన సరే ఇంటర్ బోర్డు రద్దు చేయాలని నిర్ణయించటమంటే అది ఎవరికీ మేలు చేసేందుకనీ ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా అని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డివి పరిపక్వత లేని నిర్ణయాలు

విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపక్వత లేని చిన్న పిల్లల మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాదే ఇంటర్ బోర్డును రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించాక..అడ్మిషన్లు తీసుకుంటున్నామని ఐఏఎస్ అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రికి సఖ్యత లేని భయంకరమైన పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. అడ్మిషన్లు మొదలయ్యాక ఇక ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని భావించామని కానీ మళ్లీ బోర్డును రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయమని..ఇలాంటి అంశంలో ఎవరితో చర్చించి నిర్ణయం ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. అఖిలపక్షం, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఇలా ఎవరితో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రిని నిలదీశారు. ముందు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంటర్ బోర్డు ను రద్దు చేస్తే జూనియర్ లెక్చరర్లు, కాలేజ్ ల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ వెంటిలేటర్ పై పెడితే… కాంగ్రెస్ ఏసీయూలోకి తెచ్చింది

తెలంగాణ విద్యావ్యవస్థను బీఆర్ఎస్ వెంటిలేటర్ పై పెడితే కాంగ్రెస్ ఐసీయూలోకి తెచ్చిందని కవిత అన్నారు. విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి అత్యంత నిర్లక్ష్యంగా, నాన్ సీరియస్ గా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు రద్దుకు డ్రాప్ ఔట్లే ప్రధాన కారణమని ఆయన చెబుతున్నారని..కానీ ఆయన చెప్పిన లెక్కలన్నీ అబద్దాలన్నారు. మన దగ్గర డ్రాప్ ఔట్లు చాలా తక్కువ అన్నారు. డ్రాప్ ఔట్లు జరిగితే అది ప్రభుత్వం తప్పు..కనున దాన్ని సరిదిద్దుకోవాలన్నారు. అంతేకానీ ఆ పేరు చెప్పి ఇంటర్ బోర్డును రద్దు చేస్తామని చెప్పటం సరికాదన్నారు. ఈ అంశానికి సంబంధించి బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే కచ్చితంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో బిల్లు డ్రాఫ్ట్ ను అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. నాకు హిట్లర్ ఆదర్శం నేను అలా చేయనంటే..మాకు చాకలి ఐలమ్మ ఆదర్శమని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఐక్య పోరాటాలు చేసైనా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో విద్య అందరికీ దక్కాలన్నదే తమ పార్టీ సంకల్పమని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విద్యారంగాన్ని తాము కాపాడుకుంటామన్నారు. అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ నే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గా భావించవద్దన్నారు. నిజంగానే ఇంటర్ బోర్డును విద్యాశాఖలో కలుపాలనుకుంటే కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పదేళ్ల పాటు అవసరమైన నిధులు కేటాయిస్తూ దశల వారీగా ఈ నిర్ణయాన్ని వాళ్లు అమలు చేశారని చెప్పారు. అదే తరహాలో అందరూ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడిన తర్వాత ఏకాభిప్రాయం వస్తే  3 నుంచి పదేళ్లలో నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు. అంతేగానీ ఒంటెద్దు పోకడతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. 

అనుమానాలు నివృత్తి చేయాలి- కె. శ్రీనివాస్, సీనియర్ ఎడిటర్

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో చాలా అనుమానాలున్నాయని సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. ఇంటర్ బోర్డు రద్దు కారణంగా తలెత్తే స్థానికత అంశంతో పాటు పదో తరగతికి ఉండే ప్రాధాన్యాన్ని తగ్గిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని మార్చాలంటే విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ఈ అనుమానాలకు సమాధానం చెప్పకుండా ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. 

పబ్లిక్ పాలసీ ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి- ప్రొఫెసర్ కె. నాగేశ్వర్

ఏదైనా పబ్లిక్ పాలసీ అంటే కచ్చితంగా అది ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. కానీ ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ఏం లాభం జరుగుతుందన్నది ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. జాతీయ విధానంలో ఉంది కనుక మనం కూడా అలాగే కొనసాగిద్దామనే విధానం సరికాదని చెప్పారు. ఇంటర్ బోర్డు రద్దు కారణంగా విద్యార్థులకు లాభమా? నష్టమా అన్నది ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రభావితమయ్యే జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ విద్యార్థుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా స్టేక్ హోల్డర్లతో చర్చించి నిర్ణయాలు ప్రకటించాలన్నారు. 

పీవీ తెచ్చిన విధానాన్ని రద్దు చేయాలనే- మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్

ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ప్రయోజనం ఏంటన్నది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధికారికంగా చెప్పలేదని ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధు సూదన్ రెడ్డి మండిపడ్డారు. కేవలం మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు ఈ విధానాన్ని తెచ్చారని..ఆయన ఆనవాళ్లు ఉండవద్దనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. అసలు ఈ ప్రభుత్వానికి విద్య విధానం పై ఒక దిశ, దశ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఇంటర్మీడియేట్ విధానం తెలంగాణ, ఏపీల్లోనే ఉందంటూ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంటర్మీడియేట్ విద్యా విధానం ఉందన్నారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై మరోసారి ఆలోచించి అందరితో చర్చించాకే ముందుకు వెళ్లాలని సూచించారు. 

డైవర్షన్ రాజకీయాల కోసమే- పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్

ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. లేదంటే ఒక్క ఏడాది లో ఇంటర్ బోర్డు రద్దు చేసి విద్యాశాఖలో కలపటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏడాదిలో ఇంటర్ బోర్డును రద్దు చేస్తే కచ్చితంగా అది సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. 

మహేందర్ రెడ్డి, కనిష్క కోచింగ్ అకాడమీ ఛైర్మన్

విద్య అనేది ప్రభుత్వానికి సంబంధించిన సామాజిక బాధ్యత అని కనిష్క కోచింగ్ అకాడమీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి చెప్పారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం నెమ్మదిగా ఆ బాధ్యతను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఇంటర్ విద్యను కార్పొరేటీకరణ చేసేశారన్నారు. ఇప్పుడు ప్రాథమిక, సెకండరీ విద్యను కూడా వాళ్లపరం చేసే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పరమైన ఇంటర్ బోర్డును ఉంచిన తీసేసిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ముందు కార్పొరేట్ చేతిలో బందీ అయిన ఇంటర్ విద్యను ప్రభుత్వం అధీనంలోకి తెచ్చినప్పుడే మంచి జరుగుతుందన్నారు. 

ఇంటర్ బోర్డు విషయంలో ప్రభుత్వం అందరూ స్టేక్ హోల్డర్లతో చర్చలు జరిపాక నిర్ణయం తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు కోరారు. సమావేశంలో అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ, శివరాత్రి యాదగిరి, ట్రస్మా ప్రెసిడెంట్, ఎస్. నాగేశ్వర్, జార్జ్ రెడ్డి పీడీఎస్ యూ, విజయ్, పీడీఎస్ యూ స్టేట్ జనరల్ సెక్రటరీ, శ్రీనివాస్ రెడ్డి, ట్రస్మా ప్రెసిడెంట్, మధుసూదన్, ట్రస్మా ఛైర్మన్, సాయికుమార్, టీఎస్కేవీ, వెంకట్ సాయినాథ్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, రాజ్ కమల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణలత, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అసోసియేషన్, రవి, యూఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్, మొహన్ కుమార్, ట్రస్మా స్టేట్ ప్రతినిధి, రంజిత్, రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్, ఝాన్సీ లు ప్రసంగించి తమ అభిప్రాయాలు తెలిపారు.