రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకుంటేనే మహిళా సాధికారత

26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మహిళలు – రాజ్యాంగం సదస్సు

పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

భారత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకుంటేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న నిర్వహించనున్న మహిళలు – రాజ్యాంగం సదస్సు పోస్టర్ ను శనివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులను కల్పించిందని.. వాటిని సంపూర్ణంగా వినియోగించుకుంటే ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతామని తెలిపారు. 26న ఉదయం 10 గంటల నుంచి బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు, ఆ ఫలాలు ఎంతమేరకు అందుతున్నాయి.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు.. శ్రామికులు, గృహిణుల జీవన స్థితిగతులు సహా మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై సదస్సులో చర్చించి తీర్మానాలు చేస్తామని తెలిపారు. పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.